ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన.. రాష్ట్రంలో జరుగుతున్న హింసను నియంత్రించాల్సిందిగా ఆమె పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారికి మనఃపూర్వక శుభాకాంక్షలు. చారిత్రాత్మకమైన మెజారిటీతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజల ఆశయాలు, రాష్ట్ర అవసరాలను, కఠిన సవాళ్లను దృష్టిలో పెట్టుకుని సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతలను మిళితం చేసి ఇకపై ప్రజా రంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా గడిచిన వారం రోజుల్లో, ఎన్నికల ఫలితాలు రోజు నుంచి, అటు వైసీపీ నేతలు, కార్యకర్తల మీద, ఇటు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాల మీద జరుగుతున్న దాడులు మమ్మల్ని ఎంతగానో కలిచివేశాయి’ అని షర్మిల లేఖలో పేర్కొన్నారు. ఇలా పగలకు, ప్రతీకలకు అంతు ఉండదని, సభ్య సమాజంలో, ప్రజాస్వామ్యంలో వీటికి చోటు ఉండకూడదన్నారు. ఎన్నో తీవ్రమైన సవాళ్ల మధ్య రాష్ట్ర పునర్నిర్మాణం వేగంగా, నిబద్ధతతో జరగాల్సిన సమయంలో ఇటువంటి హేయమైన దాడులు, చర్యలు శాంతితలకు మాత్రమే కాకుండా.. రాష్ట్ర ప్రగతికి, పేరుకు, వచ్చే అవకాశాలకు కూడా తీఆవ్రమైన విఘాతాన్ని కలుగజేస్తుందని షర్మిల లేఖలో పేర్కొన్నారు. ఈ తరహా దాడులకు అడ్డుకట్ట వేసేలా కఠిన చర్యలు తీసుకుంటామని ఆశిస్తున్నానన్న షర్మిల.. రాష్ట్ర ప్రగతి కోసం కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్‌కు వైఎస్ షర్మిల ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇతర మంత్రులకు కూడా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగేలా చూడడంలో ప్రత్యేక పాత్ర పోషించారని ఆశిస్తున్నట్టు షర్మిల.