సినీ, క్రీడా రంగాలకు చెందిన వారికి అనేక మంది అభిమానులుంటారు. అభిమాన సెలబ్రిటీలను ప్రత్యక్షంగా కలవాలని.. వారితో ఫొటో దిగాలని, కుదిరితే మాట్లాడాలని భావించే ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అభిమానులకు ఇలాంటి కోరికలు ఉండటం ఎంత సహజమో.. ఫ్యాన్స్ ఇలా ఎగబడితే సెలబ్రిటీలు తీవ్రంగా ఇబ్బంది పడతారు అనేది కూడా అంతే వాస్తవం. అందుకే సెలబ్రిటీలు బయటకు వెళ్తే.. కచ్చితంగా తమతో పాటు బాడీ గార్డులు ఉంటారు. అభిమానులు దగ్గరకు వచ్చి ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటారు. అయితే కొన్నిసార్లు వీళ్లు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల సెలబ్రిటీలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. తాజాగా కింగ్ నాగార్జునకు ఇదే పరిస్థితి ఎదురైంది. దాంతో ఆయన ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పాడు. అసలేం జరిగిందంటే..
నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. నాగార్జున ఉండటంతో.. ఇది కాస్త హాట్ టాపిక్‌గా మారింది. దివ్యాంగ అభిమాని ఒకరు.. నాగార్జునతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నం చేశాడు. అది గమనించిన బాడీగార్డ్.. అతడిని నిర్దాక్షిణ్యంగా పక్కకు లాగేశాడు. పాపం అతడు కింద పడిపోయే పరిస్థితి నెలకొని ఉంది. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ కావడమే కాక.. విపరీతంగా విమర్శలు వచ్చాయి. వీడియో ఉన్న దాని ప్రకారం.. నాగార్జున విమానాశ్రయం నుంచి బయటకు వస్తుండగా.. ఓ అభిమాని నాగ్‌ను కలిసేందుకు ప్రయత్నం చేశాడు. అయితే క్షణాల్లో తేరుకున్న సిబ్బంది ఒకరు ఆ వ్యక్తిని పక్కకు లాగేశాడు. ఆ సమయంలో ఈ విషయం నాగార్జున దృష్టికి వచ్చినట్లు వీడియోలో కనిపించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్ అయింది.. నాగార్జున స్పందించారు.
”ఈ ఘటన నా దృష్టికి వచ్చింది. ఇలాంటిది జరగాల్సింది కాదు. ఆ వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నా. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటాను” అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.
ఇది నా దృష్టికి వచ్చింది… ఇలా జరగకూడదు!!
నేను పెద్దమనిషికి క్షమాపణలు చెబుతున్నాను మరియు భవిష్యత్తులో అలా జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటాను !! https://t.co/d8bsIgxfI8— నాగార్జున అక్కినేని (@iamnagarjuna) జూన్ 23, 2024
ఈ వీడియో మన సైడ్ కాకుండా.. నార్త్ సైడ్ విపరీతంగా వైరల్ కావడమే కాక.. విపరీతమైన విమర్శలు వచ్చాయి. అయితే ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే ప్రథమం కాదు. గతంలో చాలా మంది సెలబ్రిటీలకు ఇలాంటి అనుభవం ఎదురయ్యింది.