విజయశాంతి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక కర్తవ్యం సినిమాతో ఆమె కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అప్పటి వరకు హీరోయిన్‌గా, గ్లామరస్‌గా నటిగా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి కర్తవ్యం సినిమాతో భిన్నమైన గుర్తింపు తెచ్చుకుంది. పవర్‌ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్‌గా స్క్రీన్ మీద విజృంభించింది. ఆ తర్వాత వరుసగా అలాంటి పవర్‌ఫుల్ పాత్రల్లో నటిస్తూ.. లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి వరకు ఫైట్లు, యాక్షన్ సీన్స్ అంటే కేవలం హీరోలు మాత్రమే చేస్తారనే అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది విజయశాంతి. ఇప్పటికి ఆమె పేరు తల్చుకోగానే.. చాలా మందికి కర్తవ్యం సినిమాలో చేసిన పాత్రే కళ్ల ముందు కనిపిస్తుంది. ఆ స్థాయిలో ఆమె ప్రేక్షకుల మదిలో గుర్తింపు సంపాదించుకుంది.
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా.. లేడీ ఓరియెంటడ్ సినిమాలకు కెరాఫ్ అడ్రెస్‌గా కెరీర్‌లో దూసుకుపోయిన విజయశాంతి.. వివాహం తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సొంతంగా పార్టీ పెట్టింది. ఆ తర్వాత ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది విజయశాంతి. ఇద్దరు బిడ్డలను దేశ రక్షణ కోసం ఆర్మీకి పంపిన తల్లిగా, అన్యాయాలను ఎదిరించే లెక్చరర్‌గా పవర్‌ఫుల్ పాత్రలో నటించి.. రాములమ్మ ఈజ్ బ్యాక్ అనిపించుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చినా సరే.. ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటుంది.
ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న ఎన్‌కేఆర్ 21వ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా బర్త్‌డే గ్లింప్స్ విడుదల చేశారు ఎన్‌కేఆర్ మేకర్స్. ఇది వారికి విజయశాంతి ఈజ్ బ్యాక్.. మళ్లీ కర్తవ్యం సినిమా గుర్తు చేశారు అని కామెంట్స్ చేస్తున్నారు. కళ్యాణ్‌రామ్ 21వ సినిమాలో విజయశాంతి మరోసారి పవర్‌ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది ఖాకీ డ్రెస్‌లో మరోసారి అల్లాడేందుకు రెడీ అయ్యింది విజయశాంతి.
ముందుగా చీరలో కనిపించిన రాములమ్మ.. తర్వాత ఖాకీ డ్రెస్‌లో గన్‌ఫైర్ చేస్తూ.. సీరియస్ లుక్‌లో కనిపించి.. అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. గ్లింప్స్ మొత్తం.. విజయశాంతి పాత్ర ఎలా ఉంటుందో వివరించేలా ఉంది. మరి ఈ చిత్రంలో విజయశాంతి పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో తెలియాలంటే.. సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. మరి విజయశాంతి లుక్ మీకెలా అనిపించింది.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
