- మాజీ ఎమ్మెల్యే లింగయ్యకు నోటీసులు
- జూబ్లీహిల్స్ పీఎస్‌కు రావాలని ఆదేశం
- అనారోగ్యంతో విచారణకు రాలేనని లింగయ్య రిప్లై
- ఈ నెల 14న హాజరవుతానని సమాచారం
- ఫోన్ ట్యాపింగ్ నిందితులతో సంబంధాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తొలిసారిగా రాజకీయ నేతకు నోటీసు జారీ అయింది. ఈ కేసులో ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్‌పై ఆరోపణలు రాగా.. తాజాగా మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు అందాయి. ఈ కేసులో ఇప్పటి వరకు అధికారులే జైలుకు వెళ్లగా.. ఇప్పుడు నేతల వంతు వచ్చింది. తాజాగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఈ కేసులో సమన్లు జారీ చేశారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేయడంతో రాజకీయవర్గాల్లో సంచలనం రేకెత్తుతోంది. మొదటిసారిగా ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకుడికి నోటీసులు జారీ కావడంతో ఉత్కంఠ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రమేయంపై విచారణలో పోలీసులు పేర్కొన్నారు. తన ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేసి నిఘా ఉంచినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే.. ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఇంకా ట్యాపింగ్ కేసులో నిందితులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పోలీసులు.
14న వస్తా
ఈ కేసులో ఆయన సోమవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ, అనారోగ్యం కారణంగా తాను రాలేనని పోలీసులకు రిప్లై ఇచ్చారు. ఈ నెల 14న విచారణకు వస్తానంటూ సమాధానం ఇచ్చారు.
మారుతున్న రాజకీయం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు అరెస్ట్ అవగా.. రాజకీయ నాయకులు కూడా అరెస్ట్రంటూ కాంగ్రెస్ నేతలు కూడా వస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తికి నోటీసులు జారీ చేయడంపై మరింత ఉత్కంఠగా మారింది. ఇప్పటి వరకు అధికారులు.. ఇక నుంచి రాజకీయ నేతల వరుస వచ్చిందనే టాక్ నడుస్తోంది. మరి నెక్ట్స్ ఎవరికి నోటీసులు జారీ చేస్తారు? ఎవరెవరికి ఈ కేసులో ప్రమేయం ఉందనే ఆసక్తి ప్రజల్లో ఉంది. ముఖ్యంగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నట్లు పొలిటికల్ బాంబులు ఈ కేసులోనే పేలనున్నాయా? మరేదైనా కేసులు ఉన్నాయా? అనే చర్చ నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఏ1 ప్రభాకర రావు, రిటైర్డ్ ఐపీఎస్, ప్రణీత్ రావు డీఎస్పీ, ఏ3 రాధాకిషన్ రావు, రిటైర్డ్ అదనపు ఎస్పీ, ఏ4 భుజంగ రావు, అదనపు ఎస్పీ, ఏ5 తిరుపతన్న, అదనపు ఎస్పీ, రిటైర్డ్ అదనపు ఎస్పీ వేణుగోపాల్ రావు, గట్టుమల్లు భూపతి అరెస్ట్ అయ్యారు.
ప్రభాకర రావు ఒక్కరే విదేశాల్లో ఉన్నారు. వీరంతా కలిసి ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు, సినిమా, వ్యాపార ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రణీత్ రావు అరెస్ట్‌తో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యేక బృందంతో విచారణ జరిపింది. ఈ కేసును విచారించే కొద్ది కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని నిర్ధారించారు పోలీసులు. రేపో మాపో పొలిటికల్ లీడర్స్‌కి కూడా నోటీసులు అందజేస్తారనే ప్రచారం జరిగింది. దానికి కొనసాగింపుగానే.. సోమవారం నాడు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేశారు.