- ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమించి ముందుకెళ్తాం
- దామగుండం వీఎల్ఎఫ్ నేవీ రాడార్ స్టేషన్ దేశానికి ఉపయోగకరం
- ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో అపోహలు సృష్టించొద్దు
- దామగుండం వీఎల్ఎఫ్ నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
ముద్ర, తెలంగాణ బ్యూరో : దేశ రక్షణ, భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుబడి పని చేస్తుందని అందుకు ఎవరెన్ని అడ్డంకులు, అవాంతరాలు సృష్టించినా వాట అధిగమిస్తూ ముందుకు వెళ్తామని కేంద్ర శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దామగుండం వీఎల్ఎఫ్ నేవీ రాడార్ స్టేషన్ దేశానికి అత్యంత ఉపయోకరమైందన్నఅయన కొందరు వ్యక్తులు ఈ ప్రాజెక్టు గురించి ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఈ రాడార్ స్టేషన్ తో పర్యావరణానికి ఎలాంటి ముప్పు, నష్టం వాటిల్లదని స్పష్టం చేశారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి దినాన దీనికి శంకుస్థాపన చేయడం హర్ణణీయమన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో దేశంలోనే రెండో అతిపెద్ద వీఎల్‌ఎఫ్ నేవీ రాడార్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసిన ఆయన… భద్రత, రక్షణ విషయంలో రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. దేశ బలమైన భద్రత కోసం ఇలాంటి స్టేషన్లు కీలకమన్నారు. పూర్వం కమ్యూనికేషన్, సమాచారం కోసం ఈగల్, ఇతర పక్షులను ఉపయోగించినట్లు కేంద్రమంత్రి వివరించారు. తదనంతరం కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తూ వస్తున్నట్లు చెప్పారు. బీజేపీ పాలనలో ఈ వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దేశం బలమైన ఆర్మీని నిర్మించేందుకు కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.