రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సోమవారం ఎన్నికల పోలింగ్ జరగనుంది. తెలంగాణలో కేవలం పార్లమెంటు ఎన్నికలకు మాత్రమే పోలింగ్ జరగనుండగా, ఆంధ్రప్రదేశ్ లో అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలలో ఓటేయాలని ఎక్కడెక్కడో వృత్తిరీత్యా వుంటున్న వారు కూడా తమ సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఈ ఉంటే మీ దగ్గర ఓటరు కార్డు లేదనో లేదా ఓటర్ స్లిప్ రాలేదని ఆంధోళనానికి గురవుతున్నారా… ఈరెండూ లేకపోయినా మీరు హాయిగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేయవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు ఏదైనా ఒకటి మీదగ్గర ఉంటే చాలు.. నిశ్చింతగా ఓటేసి రావచ్చును.
దేశంలో ఎవరు ఎక్కడ ఓటేయాలన్నా ఓటరు కార్డు ఉండాల్సిందే. ఒక వేళ ఏ కారణాల వల్ల అయినా ఓటరు కార్డు లేకపోతే..ఓటు వేయడానికి అర్హతగా కొన్ని గుర్తింపు కార్డులను భారత ఎన్నికల సంఘం సూచించింది. వాటిలో ఏది ఉన్నా మీరు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేయవచ్చు. దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్ కు పోలింగ్ ఉన్న బీఎల్వోల దగ్గరకు వెళ్లి మీ గుర్తింపు కార్డును చూపించాల్సివుంది. వారు మీ పేరును ఓటరు జాబితాలో చూసి ఒక చీటీ మీద క్రమసంఖ్య, పేరు రాసి ఇస్తారు. దాని ప్రకారం వెళ్ళి ఓటు వేయవచ్చును. ఇంతకు మునుపు ఎన్నికలలో ఏ ప్రదేశంలో మీరు ఓటేశారో ఆ కేంద్రానికి మాత్రమే వెళ్లాల్సివుంటుంది. కొత్తగా ఓటు వచ్చిన వారు మాత్రం నమోదు చేసుకున్నప్పుడు ఏ కేంద్రం అని చెప్పారో అక్కడికే వెళ్లి చీటీ పొందాల్సి ఉంటుంది.
ఓటు వేయడానికి ప్రభుత్వం అనుమతించిన గుర్తింపుకార్డులు ఇవీ…
1.పాస్‌పోర్ట్. 2. డ్రైవింగ్ లైసెన్స్, 3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్‌యూలు, కంపెనీ ఉద్యోగులకు జారీ చేసిన ఫొటోతో కూడిన సర్వీస్ గుర్తింపు కార్డులు, 4. బ్యాంకులు, తపాలా ఆఫీసుల్లో జారీ చేసే ఫోటో ఉన్న పాస్ పుస్తకాలు, 5. పాన్‌కార్డ్, 6. ఎన్‌పీఆర్ కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్, 7. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్, 8. ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డ్, 9. ఫొటోతో కూడిన పింఛను పత్రం, 10. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, 11. ఆధార్కార్డ్