- రూ.16 లక్షలు కోల్పోయిన యువకుడు
- నగల కోసం వృద్ధురాలి హత్య
ముద్ర, బాన్సువాడ: ఆన్‌లైన్‌లో బెట్టింగ్ ఆడి సులభంగా డబ్బులు సంపాదించాలని భావించిన ఓ యువకుడు, ఓ యువకుడు.. 16 మంది కోల్పోయాడు… తీసుకున్న అప్పును వాపసు కోసం ఓ వృద్ధురాలి మెడలో నగలపై కన్ను వేసి…. ఆమెను హత్య చేసి నగలు దోచుకున్నాడు… చివరకు పోలీసులకు చిక్కాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 4 రోజుల క్రితం జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వృద్ధురాలి బంగారు ఆభరణాలపై కన్నేసిన ఓ యువకుడు ఆమెను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.
బాన్సువాడలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను సీఐ కృష్ణ ఏర్పాటు చేశారు. తాడ్కోల్ డబుల్ బెడ్రూం కాలనీలో ఒంటరిగా నివాసం ఉంటున్న ఉప్పరి సాయవ్వ(70)ను అక్కడే ఉండే యువకుడు తొడిమెల సాయిబాబా ఈ నెల 12న ఉదయం గొంతు కోసి హత్య చేశాడు. ఆమె మెడలో ఉన్న బంగారు గుండ్లు, చెవి కమ్మలు, వెండి కడియాలను ఎత్తుకెళ్లాడు. నిందితుడు ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్‌లకు అలవాటుపడి రూ.16లక్షలు అప్పు చేశాడు. ఇదేక్రమంలో సాయవ్వ వద్ద కూడా రూ.20 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఒంటరిగా ఉన్న సాయవ్వను ఎలాగైనా హత్య చేసి ఆభరణాలు ఎత్తుకెళ్లాలని పథకం వేసి ఈ నెల 11న రాత్రి సమయంలో సాయవ్వకు ఫోన్ చేసి ఇంట్లో వాళ్లు తలుపు తీయడంలేదని, మీ ఇంట్లో పడుకుంటానని నమ్మించాడు.
ఉదయం 4 గంటలకు లేచి నిద్రలో ఉన్న సాయవ్వను తనతో తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. కమ్మలను ప్రైవేటు ఫైనాన్స్‌లో కుదువపెట్టి రూ.45వేలు అప్పు తీసుకొని కొంత అప్పు తీర్చి మిగిలిన డబ్బుతో ఆన్‌లైన్ గేమ్ ఆడాడు. సాయవ్వ ఫోన్ డేటా ఆధారంగా సాయిబాబాపై నిఘా ఉంచిన పోలీసులు శుక్రవారం బంగారు గుండ్లను కుదువ పెట్టేందుకు వెళ్తున్న సమయంలో తాడ్కోల్ చౌరస్తాలో పట్టుకున్నారు. కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కృష్ణ తెలిపారు. కేసును ఛేదించిన హెడ్ కానిస్టేబుల్ సతీష్, కానిస్టేబుళ్లు అశోక్, మోతిలాల్, మూస, హేమాద్రిని అభినందించారు.