మూవీ: కురంగు పెడల్
నటీనటులు: సంతోష్ వెల్మురుగన్, రాఘవన్ జ్ఞానశేఖర్, రతీష్, సాయి గణేశ్, కాళీ వెంకట్
ఎడిటింగ్: శివానందీశ్వరన్
సంగీతం: గిబ్రాన్
సినిమాటోగ్రఫీ: సుమీ భాస్కరన్
నిర్మాతలు: శివకార్తికేయన్
దర్శకత్వం: కమలా కన్నన్
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్
కథ:
కతేరి అనే ఒక చిన్న గ్రామంలో కందస్వామి (కాళీ వెంకట్) కుటుంబం నివసిస్తుంది. కందస్వామి భార్య సావిత్రి , కొడుకు మారియప్పన్ (సంతోష్). కందసామికి సైకిల్ తొక్కడం కూడా రాదు. అలా ఎక్కడికి వెళ్లినా నడిచే వెళుతున్నాడు. చివరికి ఆ ఊళ్లో వాళ్లు ‘నడిచివెళ్లే కందసామి’ అంటూ పిలిచే పరిస్థితి వస్తుంది. 12 ఏళ్ల మారియప్పన్ కి అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. మారియప్పన్, అంగరసు, సంగినరి, నిధి వీళ్లంతా ఒక్కతోటి పిల్లలు.. స్కూల్ నుంచి వచ్చింది ఆటపాటలతో కాలం గడిపేస్తుంటారు. వాళ్లు ఇంట్లో ఉండే సమయమే చాలా తక్కువ. ఎక్కువగా తోటల్లో, మోటబావుల్లో సరదాగా గడిపేస్తుంటారు. వేసవి సెలవుల్లో ఎవరి చుట్టాలింటికి వెళ్లకుండా తమ ఊళ్లోనే కర్రసాము నేర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ సమయంలోనే వారి దృష్టి సైకిల్ పైకి వెళ్తుంది. అందరు కలిసి తలా పది పైసలు చొప్పున యాభై పైసలు సంపాదించి.. ఒక గంటకు సైకిల్ అద్దెకి తీసుకున్నారు. సైకిళ్లను అద్దెకి ఇచ్చే వ్యక్తి గతంలో మిలటరీలో పనిచేసి ఉండటం వలన, పిల్లలకు అతనంటే చాలా భయం. ఒకరోజు సైకిల్ తీసుకొని పక్క ఊరిలో ఉంటున్న అక్క వాళ్ళింటికి వెళ్తాడు మరియప్పన్. అయితే అక్కడే అతను ఓ రోజు ఉండిపోవడంతో.. సైకిల్ ఇచ్చిన మిలటరీ వ్యక్తి మరియప్పన్ వాళ్ళింటికి వస్తాడు. మారియప్పన్ కనిపించడం లేదని, అతని కోసమే వెతుకుతున్నామని కందసామి చెప్తాడు. తన కొడుకు రోజూ సైకిల్ అద్దెకి తీసుకుని తిరుగుతున్నాడనే విషయం కందస్వామికి తెలుస్తుంది. ఆ డబ్బు కోసమే అతను చిన్నచిన్న దొంగతనాలు చేస్తున్నాడని అర్థమవుతుంది. మరి ఆ తర్వాత మరియప్పన్ వాళ్ళ నాన్న ఏం చేశాడనేది మిగిలిన కథ. అదేంటో తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ప్రతీ ఒక్కరి బాల్యం ఎప్పుడు ఏదో ఒకటి గుర్తుచేస్తూనే ఉంటుంది. అలా 80లలో పుట్టినవాళ్ళు బాల్యంలో చేసిన అల్లర్లు, ఆటలు, పాటలు అన్నింటిని ఓసారి గుర్తుచేస్తూ దర్శకుడు కమలా కన్నన్ తీసిన మూవీ ‘కురంగు పెడల్’. ఇది ఓ వర్గం వారికి కచ్చితంగా నచ్చేస్తుంది. అయితే ఈ తరం వారికి నచ్చే మాస్ ఎలిమెంట్స్, సాంగ్స్, ఫైట్స్, ట్విస్ట్ లు , థ్రిల్స్ ఏవీ లేవు. కానీ ఆ తరం తాలుకా పరిస్థితులు ఎలా ఉంటాయో వారి బాల్యం ఎలా ఉంటుందో చూసే అవకాశం ఉంది.
ఏం పొందిన, ఏం కోల్పోయిన అన్నీ క్షణికమే.. ఇక్కడ శాశ్వతమైనది ఏదైనా ఉందంటే అది నీ జ్ఞాపకమే. నీ బాల్యపు జ్ఞాపకాలను మరోసారి సినిమాలో చూడాలంటే ఈ సినిమా చూడాల్సిందే అనేంతల పాత్రలు, కథనం సాగుతుంటాయి. సినిమా అంటే నాలుగు పాటలు, అయిదు ఫైట్లు, ఆరు గుర్తుండిపోయే మాస్ డైలాగ్స్ ఏ కాదు.. సినిమా అంటే మన జీవితం.. మన బాల్యం.. మన నాన్నల జీవితం అంటూ సాగే ఈ సినిమా కథనం అందరినీ ఆలోచింపజేస్తూ.. అలా మన బాల్యపు జ్ఞాపకాలలోకి తీసుకెళ్తుంది.
ఇప్పటికి మనం పేపర్లో , టీవీల్లో చూస్తుంటాం.. తొంభై, ఎనభై ల్లో చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని.. అప్పటి జ్ఞాపకాలని మరోసారి గుర్తుచేసుకుంటూ ఆ మనుషులని, ఆ రోజుల్లో మనం చేసిన అల్లర్లని, ఆ స్వచ్ఛమైన స్నేహమని మరోసారి మనకి గుర్తుచేసుకుంటే ఈ సినిమా అందరికి గుర్తుండిపోతుంది. ఈ మూవీలో ఎక్కడా కూడా అశ్లీలమైన సీన్లు లేవు. అసభ్య పదాలు ఎక్కడ వాడలేదు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా మేకర్స్ తీశారు. మూవీలో నటించిన పిల్లలంతా తమ పాత్రలలో ఒదిగిపోయారు. ఎవరూ కూడా నటిస్తున్నట్టుగా అనిపించదు. ఇక ఈ సినిమాకి మరో ఆకర్షణ లొకేషన్స్. ఆ లొకేషన్స్ చూస్తుంటే మనకి కూడా అక్కడికి వెళ్లిపోవాలనిపిస్తుంది. ఈ విషయంలో సుమీ భాస్కరన్ సినిమాటోగ్రఫీ బాగుంది.. జిబ్రాన్ సంగీతం కథకి సరిపోయింది. శివానందీశ్వరన్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
కందస్వామిగా కాళీ వెంకట్ , కొడుకు మారియప్పన్ గా సంతోష్ సినిమాకి ఫ్రధాన బలంగా నిలిచారు. ఇక మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
ఫైనల్ గా: మీ బాల్యాన్ని తట్టిలేపే ఈ సినిమాని డోంట్ మిస్.
రేటింగ్ : 2. 25 / 5
✍️. దాసరి మల్లేశ్