Home » పదిలోపు డీఎస్సీ ఫలితాలు! నేడు తుది కీ విడుదల- విద్యాశాఖ కసరత్తు

పదిలోపు డీఎస్సీ ఫలితాలు! నేడు తుది కీ విడుదల- విద్యాశాఖ కసరత్తు

by v1meida1972@gmail.com
0 comment

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా నియామక కమిటీ (డీఎస్సీ) రాతపరీక్షలకు సంబంధించిన తుది కీ విడుదలపై విద్యాశాఖ అధికారుల కసరత్తు పూర్తయ్యింది. బుధవారం తుది కీ విడుదలయ్యే అవకాశముంది. ఈ దిశగా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జులై 18 నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా కంప్యూటర్ ఆధారిత విధానం (సీబీఆర్టీ)లో డీఎస్సీ రాతపరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 2,79,957 మంది దరఖాస్తు చేయగా, 2,45,263 (87.61 శాతం) మంది అభ్యర్థులు రాతపరీక్షలకు హాజరయ్యారు. 34,694 (12.39 శాతం) మంది గైర్హాజరయ్యారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను ఫిబ్రవరి 29న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండితులు, సెకండరీ గ్రేడ్ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించిన ప్రశ్నాపత్రాలకు మాధ్యమాల వారీగా వేర్వేరుగా ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను గతనెల 13న పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ప్రాథమిక కీపై 28 వేలకుపైగా అభ్యంతరాలు వచ్చాయి. వాటిని సబ్జెక్టు నిపుణులు పరిశీలించారు. బుధవారం తుది కీని విడుదల చేస్తారు. ప్రశ్నాపత్రాల్లో ఉండే తప్పులను గుర్తించడం, వాటికి మార్కులు కలుపుతారా? లేదంటే ఆ ప్రశ్నలను తొలగిస్తారా? అన్నది బుధవారం స్పష్టత రానుంది. ఇంకోవైపు డీఎస్సీ రాతపరీక్షలో రెండు విడతల్లో 18 ప్రశ్నలు తిరిగి వచ్చాయి. వాటిపైనా విద్యాశాఖ అధికారులు వివరణ ఇవ్వనున్నారు. ఈనెల పదో తేదీలోగా డీఎస్సీ ఫలితాలను ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. తొలుత గురుపూజోత్సవం సందర్భంగా గురువారం డీఎస్సీ ఫలితాలను ప్రకటించాలని భావించినప్పటికీ వీలు కావడం లేదని తెలిసింది. టెట్ మార్కులను కలిపి డీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్)ను ప్రకటిస్తారు. ఆ తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా జిల్లాల వారీగా పోస్టుల వారీగా 1:3 నిష్పత్తి చొప్పున మెరిట్ జాబితాను విద్యాశాఖ విడుదల చేస్తుంది. ధ్రువపత్రాల పరిశీలన ముగిసిన తర్వాత 1:1 నిష్పత్తిలో జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టుల వారీగా అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in