Home » భద్రాచలం వాసులకు ‘సెప్టెంబర్’ భయం.. ముంపు ముప్పుతో టెన్షన్ టెన్షన్

భద్రాచలం వాసులకు ‘సెప్టెంబర్’ భయం.. ముంపు ముప్పుతో టెన్షన్ టెన్షన్

by v1meida1972@gmail.com
0 comment

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదులు ఉగ్రరూపాన్ని దాల్చాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలుండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా రెండు రాష్ట్రాల ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. ఇక సెప్టెంబర్ వచ్చిందంటే చాలు భద్రచాలం వాసులు వణికిపోతున్నారు. భద్రాచలం వద్ద గతంలో గోదావరిని సెప్టెంబర్‌లో భయానక వరదలు ముంచెత్తటమే అందుకు ప్రధాన కారణం. శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో రామాలయ పరిసరాల్లో వరద నీరు ముంచెత్తింది. ఆలయ పడమర మెట్ల మార్గంలో దాదాపు నడుము లోతు నీళ్లు చేరాయి. వివిధ దుకాణాలు, అన్నదాన సత్రం జలమయమయ్యాయి. అప్పటికప్పుడు స్థానికులు కరకట్ట వద్దకు చేరుకుని స్లూయీస్‌ గేట్లను తెరిపించటంతో వరద నీరు నదిలోకి వెళ్లి తాత్కాలికంగా ఉపశమనం లభించింది. భద్రాచలం వద్ద గోదావరి వరద కొనసాగుతోంది. రెండ్రోజుల క్రితం 23 అడుగులు ఉండగా శనివారం ఉదయం 21 అడుగు మేర చేరింది. శనివారం సాయంత్రం నుంచి వరద ఉద్ధృతి పెరగటంతో ఆదివారం ఉదయం 11 గంటలకు 31.9 అడుగులకు చేరుకుంది. ఆతర్వాత ప్రవాహం నిలకడగా మారి సాయంత్రం 4 గంటలకు 31.2 అడుగులకు తగ్గింది. అయితే 43 అడుగులకు చేరితే మెుదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గత జులై చివర్లో కురిసిన వర్షాలకు అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక సెప్టెంబర్ నెలలో చాలా సార్లు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. 1978లో 54.2 అడుగులు, 1994లో 58.6 అడుగులు, 2005లో 54.9 అడుగులు, 2011లో 43.3, 2014లో 56.1, 2019లో 51.2 అడుగుల మేర గోదావరిలో వరద ఉదృతి పెరిగింది. ఇక గడిచిన వందేళ్లలో గరిష్ట వరద 1986లో 75.6 అడుగులకు చేరుకుంది. దీంతో సెప్టెంబర్ నెల వచ్చిందంటే చాలు భద్రాచలం వాసులు ముంపు భయంతో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక భారీ వరద నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి కరకట్టను కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్‌ ఆదివారం సందర్శించారు. కరకట్ట సమీపంలోని లోతట్టు ప్రాంతవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కూడా భారీ వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in