Home » అనిల్‌ అంబానీపై ఐదేళ్లు నిషేధం .. రూ.25 కోట్ల జరిమానా

అనిల్‌ అంబానీపై ఐదేళ్లు నిషేధం .. రూ.25 కోట్ల జరిమానా

by v1meida1972@gmail.com
0 comment

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ అవినీతిపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజీ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ) ఎట్టకేలకు చర్యలు తీసుకుంది. స్టాక్‌ మార్కెట్ల నుంచి ఆయన్ను ఐదేళ్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌హెచ్ఎఫ్ఎల్‌)లో నిధుల మళ్లింపుపై శుక్రవారం అనిల్‌ అంబానీతో పాటు రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ మాజీ అధికారులపై కూడా సెబీ చర్యలు చేపట్టింది. వీరితో పాటు మరో 24 సంస్థలపై ఐదేళ్ల నిషేధాన్ని విధించింది. పైగా అనిల్‌ అంబానీకి రూ.25 కోట్ల జరిమానా విధిస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. ఏలిస్టెడ్‌ కంపెనీలోనైనా డైరెక్టర్‌ లేదా కీ మేనేజిరియల్‌ పర్సనల్‌ (కెఎంపి) లేదా మార్కెట్‌ రెగ్యులేటర్‌ వద్ద నమోదైన మధ్యవర్తి పొజీషన్‌ సహా సెక్యూరిటీస్‌ మార్కెట్‌లతో సంబంధం ఉండే ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనకుండా ఐదేళ్లపాటు అంబానీపై నిషేధం ప్రకటించింది. లిస్టెడ్‌ కంపెనీలో డైరెక్టర్‌ పోస్టు నుంచి కూడా ఆయన్ను తప్పించింది. రిలయన్స్‌ హోం ఫైనాన్స్‌ను సైతం సెక్యూరిటీ మార్కెట్ల నుంచి ఆరు నెలలపాటు పాటు నిషేధించడంతోపాటు రూ.6 లక్షల జరిమానా విధించింది. ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన మరికొన్ని సంస్థలపై రూ.25 కోట్ల జరిమానాకు ఆదేశించింది. అక్రమంగా రుణాలు పొందడం లేదా రుణాలు జారీ అయ్యేందుకు సహకరించినందుకుగానూ వాటిపై చర్యలు తీసుకుంది. 2022లోనూ సెబీ వీరందరిపై నిషేధం విధించడం గమనార్హం. రుణాల రూపంలో ఆర్‌హెచ్ఎఫ్ఎల్‌ నిధులు మళ్లింపు మొత్తం 222 పేజీలతో సెబీ రిపోర్టును విడుదల చేసింది. ఆ వివరాలు.. అనిల్‌ అంబానీ తన అనుబంధ సంస్థలకు రుణాల రూపంలో ఆర్‌హెచ్ఎఫ్ఎల్‌ నిధులను మళ్లించారు. అందుకోసం కంపెనీకి చెందిన కీలక నిర్వహణాధికారులతో కలిసి కుట్ర పన్నారు. ఆర్ఎఫ్‌హెచ్ఎల్‌ డైరెక్టర్ల బోర్డు నిలువరించే ప్రయత్నం చేసినా యాజమాన్యం పట్టించుకోలేదు. అనిల్‌ అంబానీ ఒత్తిడితోనే కీలక అధికారులు నిబంధనలను అతిక్రమించడంతో పాటుగా అవినీతికి పాల్పడ్డారు. ఇతర సంస్థలు నిధుల గ్రహీతలుగా లేదా మళ్లింపునకు మధ్యవర్తిగా వ్యవహరించాయని విచారణలో తేలింది. ఈ రుణాలు పొందిన చాలా కంపెనీలు తిరిగి చెల్లించటంలో విఫలమయ్యాయి. ఆర్ఎఫ్‌హెచ్ఎల్‌ దివాలా తీసింది. ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం దివాలా పరిష్కార ప్రణాళికకు వెళ్లడంతో పబ్లిక్‌ వాటాదారుల పరిస్థితి దుర్భరంగా మారింది. ‘2018లో కంపెనీ షేరు ధర రూ.59.60గా ఉండగా.. 2020 నాటికి కంపెనీ మోసం బయటపడింది. షేరు విలువ రూ.0.75కు పడిపోయింది. ఇప్పటికీ తొమ్మిది లక్షల మంది వాటాదారులు నష్టాలతో కొనసాగుతున్నారు.” అని సెబీ తన నివేదికలో పేర్కొంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in