- ఫీల్ట్ లెవల్ రిపోర్టు, శాటిలైట్ సమాచారం ఆధారంగా సాగు భూమి గుర్తింపు
- సాగు భూములు పంపాలని అన్ని జిల్లాలకు సర్కార్ వివరాలు
- ఈ నెల 30న రాష్ట్ర మంత్రి వర్గం భేటీలో ఆమోద ముద్ర
- సంక్రాంతి నుంచే అమలుకు సన్నద్ధం
ముద్ర, తెలంగాణ బ్యూరో : సంక్రాంతి నుంచి ప్రారంభం కానున్న రైతు భరోసా పథకం అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంట పెట్టుబడి సాయం అర్హులకే అందేలా కార్యచరణ రూపొందించిన సర్కార్.. పథకం అమలుపై విధివిధానాల రూపకల్పనను వేగవంతం చేసింది. గత ప్రభుత్వ హయాంలో కొండలు.. గుట్టలు.. రోడ్లకూ రైతుబంధు సాయం అందినట్లు గుర్తించిన ప్రభుత్వం ఇకపై సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అర్హులైన ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం అందించవచ్చనే భావనతో ఉంది. అయితే సాగు భూముల గుర్తింపు విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది.
కిందిస్థాయి అధికారుల నుంచి క్షేత్రస్ధాయి నివేదిక తెప్పించుకోవడంతో పాటు శాటిలైట్ సమాచారం ఆధారంగా సాగు భూమిని గుర్తించి ఆర్థికసాయం అందించనుంది. ఈ మేరకు తమ జిల్లావ్యాప్తంగా సాగులో ఉన్న భూమికి సంబంధించిన నివేదికలను సమర్పించడానికి ప్రభుత్వం అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో అధికారులకు పలు సూచనలు చేసింది. గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఇచ్చిన సొమ్ము పోడు భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, రోడ్లపాలిందనే నేపథ్యంలో బీడు భూములు, గుట్టలు, కొండలు, ఫాంహౌజ్‌లకు ఈ స్కీంను అమలు చేయబోమని ఇది వరకు ప్రభుత్వం ప్రకటించింది.
30న అమోదముద్ర..
రైతుభరోసా అర్హుల ఎంపికకు సంబంధించి రూపొందించనున్న విధివిధానాలను మరో రెండు రోజుల్లో పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ తర్వాత 30న జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో విధివిధానాలకు ఆమోద ముద్ర వేయాలని కోరుతోంది. తాజాగా రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఇక గత ప్రభుత్వం పెట్టుబడి మద్దతు దుర్వినియోగం చేసి, అనర్హుల ఖాతాల్లోకి భారీ మొత్తంలో జమ చేసి ప్రజాధనాన్ని వృధా చేసింది.
ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా.. నిజమైన రైతులకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయించినట్లు తెలిపారు. అయితే సీలింగ్ విధించకుండానే పథకాలను అమలు చేసేలా వ్యూహాలు రచిస్తున్న ప్రభుత్వం అర్హులైన రైతులకు ఈ పథకం లబ్ది కోల్పోకుండా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రతి సంవత్సరం ఎకరాకు రూ.15వేల పెట్టుబడి సాయంగా అమలు చేయడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరాకరణ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన పేరు పెట్టారు. ఈ సంక్రాంతి నుంచి ఈ పథకం ప్రారంభించి ప్రతి ఎకరాకూ రూ.7,500 చొప్పున ఏటా రెండు విడతలుగా లబ్ధిదారులకు సాయం అందిస్తామని మంత్రి తెలిపారు.