చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీ.. ఎంఎస్‌ఎంఈ (MSME) పాలసీ -2024 ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. బుధవారం మాదాపూర్ శిల్పకళా వేదికగా ఎంఎస్ పాలసీని సిఎం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణకు వీలుగా పరిశ్రమల అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా నూతన పారిశ్రామిక నమూనా రూపకల్పన సిఎం ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
అమెరికాలోని వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతో నూతన పారిశ్రామిక సంస్కరణను తీసుకురాబోతున్నామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. ఈ రాష్ట్రంలో కొత్తగా ఆరు విధానాలను తీసుకురావాలని తెలంగాణ సర్కార్ ఆలోచిస్తోంది. పారిశ్రామిక అభివృద్ధికి ఎంఎస్‌ఎం పాలసీ, ఎగుమతి విధానం, కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్‌డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ అనే ఆరు కొత్త పాలసీలను గత సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను నియమించారు. నేడు ఎంఎస్‌ఎంఈ పాలసీని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.