కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు రైతుల కోసం ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి కలెక్టర్ ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎకరం, రెండు ,మూడు ఎకరాలతో పాటు ఒక సెంటు భూమి ఉన్న రైతులు సైతం లక్ష రూపాయల వరకు ఆదాయం పొందడం ఎలా అనేది ఈ ఎగ్జిబిషన్ ద్వారా అవగాహన కల్పిస్తారని తెలిపారు. రైతులు ఎన్ని పనులు ఉన్నా ఈ ఎగ్జిబిషన్ ను తిలకించి అవగాహన పొందాలని సూచించారు. జిల్లా రైతుల కోసం తొలిసారి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రెండు రోజులపాటు నిర్వహించే అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ కు రైతులు హాజరై పూర్తి అంశాలపై అవగాహన పొంది వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబించాలని తెలిపారు. అనంతరం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. జిల్లా రైతాంగానికి అవసరమైన అనేక అంశాలు ఈ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చోరవతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కోసం జిల్లా రైతులకు కావలసిన అన్ని వనరులను చేకూరుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ శాస్తవ్రేత్తలు, రైతులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ తో రైతులకు ఎంతో ప్రయోజనం: కలెక్టర్ జితేష్ వి.పాటిల్
14
previous post