మున్నేరు వరద తగ్గుముఖం పట్టగానే బాధితులకు పూర్తి స్థాయిలో సహాయం అందించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. గురువారం నుంచి వరద బాధితుల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేస్తామని తుమ్మల తెలిపారు. ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నోళ్లకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ”వరద ప్రభావిత ప్రాంతాల్లో బురద తొలగించేందుకు అదనంగా పారిశుధ్య కార్మికులను, ట్రాక్టర్లను పక్క జిల్లా నుంచి రప్పిస్తున్నాం. వరదల్లో పూర్తిగా మునిగిన ఇండ్లు 7 వేలకు పైగా ఉన్నాయి. బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నాం. నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం’ అని వెల్లడించారు. ఇంకా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదన్నారు. గత వందేండ్లలో ఎన్నడూ ఇలాంటి వరదలు రాలేదని, అయినా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సహాయక చర్యలు చేపట్టామన్నారు. సహాయక చర్యలు పాలుపంచుకున్న అధికారులు, సిబ్బంది, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఫైర్ ఇంజన్లతో రోడ్లను శుభ్రం చేస్తున్నట్టు చెప్పారు. వ్యాధులు ప్రబలకుండా హెల్త్ డిపార్ట్మెంట్ఆధ్వర్యంలో పది బృందాలు రంగంలోకి దిగాయని, ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ శ్రీజ, సీపీ సునీల్ దత్, కమిషనర్ అభిషేక్ అగస్త్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 6 నుంచి వరద బాధితుల ఖాతాల్లో రూ.10 వేలు జమ
12