Home » అష్టాదశ బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన నిమిషాంబ దేవి ఆలయం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

అష్టాదశ బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన నిమిషాంబ దేవి ఆలయం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya News
0 comment
 అష్టాదశ బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన నిమిషాంబ దేవి ఆలయం - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ
  • 16 నుంచి 18 దాకా ఉత్సవాలు

బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: బోడుప్పల్ నగర పాలకసంస్థ పరిధిలో వేంచేసివున్న శ్రీ మాతా నిమిషాంబ దేవి ఆలయం అత్యంత వైభవంగా ముస్తాబైంది. అమ్మవారి అష్టాదశ (18వ) వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చురుగ్గా నిర్వహిస్తున్నారు. ఈనెల 16 (ఆదివారం) నుంచి 18వ తేదీ (మంగళవారం) మూడు రోజులపాటు బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు సుప్రభాతంతో పూజలు ప్రారంభమవుతాయి. దేవతార్చన, గోపూజ, శాంతిమంత్ర పఠనం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, దీక్షధారణ, షోడశ స్తంభపూజ, ద్వార పూజ, యాగశాల ప్రవేశం, అఖండ దీపస్థాపన, అంకురార్పణ, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. అదేరోజు ఉదయం 10 గంటలకు సామూహిక చండీ హోమం నిర్వహించారు.

బంగారు చీరతో అమ్మవారికి అలంకారం

ఉత్సవాల ప్రారంభం రోజున సాయంత్రం నిమిషాంబ దేవిని బంగారు చీరతో అలంకరిస్తారు. నిత్యం చిరుదరహాసంతో భక్తులకు అభయమిచ్చేలా కనిపించే అమ్మవారి రూపం, బంగారు చీరతో మరింత కాంతులీనుతూ భక్తజన సందోహాన్ని ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతుందని ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర శర్మ తెలిపారు. మండప ఆరాధన, మూలమంత్ర హవనం, మహానీరాజనం, మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ అనంతరం తీర్థ ప్రసాదాల వితరణతో తొలిరోజు ఉత్సవాలు ముగిశాయి.

అమ్మవారి సన్నిధిలో నరదృష్టి నివారణ హోమం

రెండోరోజు 17వ తేదీన ఏకాదశి ఉదయం 8 గంటలకు వేదస్వస్తి, గణపతిపూజ, పుణ్యాహవాచనం, మండప దేవతా పూజలు, మూలమంత్ర హవనములు నిర్వహిస్తారు. 9 గంటలకు అమ్మవారి శ్రీచక్రార్చన, 10 గంటలకు నక్షత్ర నవగ్రహ పాశుపత హోమం, సామూహిక చండీ హోమం, నరదృష్టి నివారణకు శక్తి హోమం, మహాలక్ష్మీ అనుగ్రహం కోసం హోమం నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి జరిగే ప్రత్యేక పూజాదికాల తర్వాత తీర్థప్రసాదాల వితరణతో ఆరోజు కార్యక్రమాలు ముగుస్తాయి.

56 రకాల పండ్ల రసాలతో నిజాభిషేకం

మూడోరోజున ఉదయం నిర్వహించే పూజల తర్వాత 9 గంటల సమయంలో అమ్మవారికి పంచామృతాలతో పాటు 56 రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో నిజాభిషేక కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం పూజల అనంతరం రాత్రి భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి బి.హేమచందర్ తెలిపారు. నిర్ణీత రుసుం చెల్లించే భక్తులు హోమాలు, నిజాభిషేకంలో పాల్గొనేందుకు అనుమతి ఉంటుందని ఆయన వివరించారు.

బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఆలయ చైర్మన్ వినోద్ కుమార్ వర్మ, ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ హేమచందర్, ప్రధానార్చకులు చంద్రశేఖర శర్మ పూర్తి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం వున్నందున, ఎవరికి ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నామని చైర్మన్ వినోద్ కుమార్ వర్మ తెలిపారు. ఈ ఆలయంలో శ్రీమాత నిమిషాంబదేవి సహా గణపతి, శివాలయం, శ్రీరామపరివార్, ఆంజనేయ, దత్తాత్రేయ, సాయిబాబా, నవగ్రహాలు, నాగదేవతల ఉపాలయాలు కూడా ఉన్నాయి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in