నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం కుట్రలతోనే సృష్టిస్తోందని అఖిల భారత సిఐటియు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తపన్ సేన్ తీవ్రంగా విమర్శించారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ట్రైనింగ్ సెంటర్ ఆడిటోరియం లో “సంక్షోభంలో విశాఖ ఉక్కు-పరిష్కారం ఎలా”అనే అంశంపై సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల భారత సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ మాట్లాడుతూ కేంద్రంలో మరొకసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నేటికీ కొనసాగించాలనే ఆలోచనతోనే ఉందని ఆయన అన్నారు. పోరాటాల ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకుంటామని చెబుతున్న ప్రభుత్వం తక్షణమే స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ చేపట్టాలని కోరారు. దీనికోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం స్వాగతిస్తామని అన్నారు. తక్షణమే సొంత గనులు కేటాయించాలని కోరారు. దీనిపై కార్మిక వర్గం అనునిత్యం పర్యవేక్షణ చేస్తూ ప్రభుత్వ, ఉన్నత యాజమాన్యాలు అనుసరిస్తున్న వ్యతిరేక చర్యలను కార్మిక వర్గానికి తెలియజేస్తూ చైతన్యవంతమైన పోరాటాలను మరింత ఉదృతం చేయాలని ఆయన వివరించారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ “ఇస్కో”సుదీర్ఘ పోరాటమని ఆయన అన్నారు. నేటి వరకు విశాఖ స్టీల్ కార్మిక వర్గం చేస్తున్న పోరాట ఫలితమే నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ సంఖ్యాబలం తగ్గిందని, రాష్ట్రంలో ప్రభుత్వం మారిందని ఆయన అన్నారు. కార్మిక సంఘాలు మరింత ఐక్యంగా పాలకులపై ఒత్తిడి కలిగించే విధంగా పోరాట రూపకల్పన మరియు స్పష్టమైన నిర్ణయాలతో కార్మిక చైతన్య పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
మరొక ముఖ్య వక్త మాజీ స్టీల్ ప్లాంట్ సిఎండి శ్రీ వై శివసాగర్ రావు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు స్టీల్ వినియోగం పైనే ఉందని ఆయన అన్నారు. దానికి అనుగుణంగానే 2030 నాటికి దేశం 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించిందని ఆయన వివరించారు. నేటి సంక్షోభ నివారణకు దీనికి అవసరమైన ముడి ఇనుప ఖనిజపు నిలువలను కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని ఆయన అన్నారు. గతంలో బైలదిల్లా 4,5 బ్లాక్ కుల నుంచి వచ్చే ముడి ఇనుప ఖనిజ ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్విరామంగా అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన వివరించారు. నేటి మార్కెట్లో ఉన్న డిమాండ్ కి అనుగుణంగా ఉత్పత్తిని పెంచే విధంగా చర్యలు తీసుకుంటూ, దీనికి అవసరమైన ఆదేశాలను ప్రభుత్వాలకు వివరించే సమయంలో మన పరిశ్రమ అభివృద్ధికి దోహదపడే నిర్ణయాలను తీసుకోవాలని ఆయన అన్నారు. దీనికి అవసరమైన మానవ వనరులను ఉపయోగించే సమయంలో తగు జాగ్రత్తలను తీసుకుంటు వారిని ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. కనుక ఆ విధంగా యాజమాన్యాలు కృషి చేస్తే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని ఆయన వివరించారు.
మరొక వక్త స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ లలిత్ మిశ్రా మాట్లాడుతూ పరిశ్రమ తల్లి లాంటిదని దీనిని కాపాడుకోవడం కొడుకుల గా మనందరి బాధ్యతగా గుర్తించాలని ఆయన అన్నారు. దీనిపై అనునిత్యం కాపాడుకునే విధంగా కార్మిక వర్గం చైతన్యవంతమైన పోరాటాలలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితికి స్టీల్ ప్లాంట్ లోని ఉన్నత యాజమాన్యం ప్రధాన బాధ్యుడని స్టీల్ మంత్రికి ఆయన వివరించాచనని ఆయన అన్నారు. ఇక్కడ యాజమాన్యం అనాలోచిత నిర్ణయాల వల్ల కర్మాగారంలో కార్మికులు, యంత్రాలు తీవ్రంగా నష్టపోయారని ఆయన వివరించారు. దీనిపై కార్మికులలో చైతన్యం కలిగించి తద్వారా ఉద్యమ రూపకల్పనతో పాటు ఐక్య ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
స్టీల్ ప్లాంట్ మాజీ డైరెక్టర్ (ఆపరేషన్) కె కె రావు మాట్లాడుతూ యాజమాన్యం, కార్మికులు సమన్వయంతో పని చేయడం ద్వారా ఉత్పత్తి నాణ్యత మన కర్మగార గౌరవాన్ని మరింత అభివృద్ధి చెందిస్తుందని ఆయన వివరించారు. కనుక ఆ దిశగా ప్రయత్నం చేయడానికి యాజమాన్యం కృషి చేస్తే ఈ సంక్షోభాలను అధిగమించడం పెద్ద విషయం కాదని ఆయన అన్నారు.
ఈ సదస్సులో మాజీ ఈడి (ఫైనాన్స్) జి ఎస్ ఎన్ మూర్తి, సభాధ్యక్షులుగా స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటిదాస్, సదస్సు తీర్మానాన్ని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి ప్రవేశపెట్టారు. దీనిలో స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయోధ్యరామ్, ఇతర సంఘాల ప్రతినిధులు సిహెచ్ సన్యాసిరావు, డి సురేష్ బాబు, డివి రమణారెడ్డి, పరంధామయ్య, స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ అధ్యక్షులు జి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ, జగ్గు నాయుడు, నగర సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె ఎం శ్రీనివాస్, ఆర్ వి ఎస్ కుమార్, పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ జోతేశ్వరరావు, కుమార మంగళం, స్టీల్ సిఐటియు నాయకులు పి శ్రీనివాసరాజు, బి అప్పారావు, టివి కె రాజు, గంగాధర్, నీలకంఠం, బి తౌడన్న, పుల్లారావు, మరిడయ్య, కెవి సత్యనారాయణ, బి మహేష్ తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విధానాలే విశాఖ స్టీల్ ను దెబ్బతీశాయి….
41